నగరంలో ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లలో చౌక రకపు మద్యాన్ని నింపి విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా ఛేదించారు. మాదాపూర్, కేపీహెచ్‌బీ, కొండాపూర్ ప్రాంతాల్లో నిర్వహించిన వరుస దాడుల్లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి సుమారు రూ.8 లక్షల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా నగరంలో విస్తృతంగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఉదయం 6 గంటల సమయంలో గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపంలోని ఇందిరా నగర్–లింగంపల్లి రోడ్డుపై అధికారులు నిఘా పెట్టారు. ఈ సమయంలో టీఎస్ 03 ఈడబ్ల్యూ 6244 నంబర్ గల తెల్లటి స్కూటీపై వెళ్తున్న వ్యక్తులను తనిఖీ చేయగా, వారి వద్ద 15 నకిలీ గ్లెన్‌లివిట్ మద్యం బాటిళ్లు లభించాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు కేపీహెచ్‌బీకి చెందిన ధీని ప్రకాష్ గౌడ్ (29) బార్నీస్ బీర్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. ఇతని సమాచారంతో అతని నివాసంలో సోదాలు నిర్వహించగా గ్లెన్‌ఫిడిచ్, చివాస్ రీగల్, డేవార్స్, బ్లూ లేబుల్, అమృత్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన 46 నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం సరఫరా చేస్తున్న మృత్యుంజయ మహంతిని కొండాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు.
గత రెండు నెలలుగా నిందితులు ఖాళీ అయిన ఖరీదైన మద్యం బాటిళ్లలో ఆఫీసర్స్ ఛాయిస్, ఓక్ స్మిత్ వంటి చౌక మద్యాన్ని నింపి సీలు వేసి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. మొత్తం 139 నకిలీ మద్యం బాటిళ్లు, 136 ఖాళీ బాటిళ్లు, 4 మొబైల్ ఫోన్లు, 3 స్కూటీలు, ప్యాకింగ్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ పర్యవేక్షణలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు విజయవంతంగా నిర్వహించారు.









