మేడారం జాతర ఆహ్వానాలు అందజేసిన మంత్రులు

Medaram Maha Jatara invitations were formally presented to CM Revanth Reddy and ministers in the Telangana Assembly.

శాసనసభలో మేడారం మహా జాతర ప్రత్యేక సందడి
తెలంగాణ శాసనసభలో మేడారం మహా జాతర సందడి నెలకొంది. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, దేవాదాయ ధర్మాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు పలువురు మంత్రులకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికలను అందజేశారు.

సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం
ఈ సందర్భంగా మేడారం ఈఓ వీరస్వామి, సమ్మక్క–సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఇతర పూజారులు ఆలయ సంప్రదాయం ప్రకారం కంకణం కట్టి, కండువా కప్పి, బంగారం అందజేసి మేడారం మహా జాతరకు ఆహ్వానించారు. ప్రముఖులకు అధికారికంగా ఆహ్వాన పత్రికలు అందజేసి, మహా జాతరకు తప్పకుండా హాజరుకావాలని మంత్రులు కోరారు.

ఈ నెల 28 నుంచి మేడారం మహా జాతర
ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర ఘనంగా జరగనుంది. మేడారం అభివృద్ధికి ప్రభుత్వం రూ.230 కోట్లతో విస్తృత పనులు చేపట్టింది. ఈ నెల 19న సమ్మక్క–సారలమ్మల గద్దెలు, ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు.

ఆధునికత–ఆదివాసీ సంస్కృతి సమ్మేళనం
సరికొత్తగా అభివృద్ధి చేస్తున్న మేడారం ఆలయ ప్రాంగణం మరో వెయ్యి సంవత్సరాల పాటు నిలిచేలా పూర్తిగా రాతి కట్టడాలతో నిర్మితమవుతోంది. సమ్మక్క–సారలమ్మల త్యాగాలు, ఆదివాసీల చరిత్ర ప్రతిబింబించేలా ద్వారాలు, ప్రహరీలు రూపొందించారు. ఆదివాసీ సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆధునికత సమ్మేళనంగా మేడారం ముస్తాబైంది. ఏటా లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share