దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠాలో కీలకంగా సహకరిస్తున్న ఇద్దరు సభ్యులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ ముఠాకు బ్యాంక్ ఖాతాలు సమకూర్చి ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని సైబర్ క్రైం డీసీపీ అరవింత్ బాబు వెల్లడించారు.
డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు డిసెంబరు 13న గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ కాల్ చేశారు. ఆమె భర్త పెద్ద నేరంలో చిక్కుకున్నాడని, తక్షణమే అరెస్టు చేస్తామని భయపెట్టారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో కేసు నుంచి బయటపడాలంటే మీ వద్ద ఉన్న డబ్బును పంపిస్తే, నోట్ల సీరియల్ నెంబర్లు పరిశీలించి తిరిగి చెల్లిస్తామని నమ్మించి మొత్తం రూ.1.95 కోట్లను మోసం చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు గుజరాత్‌కు చెందిన సోయబ్ జాహిద్, ఆనస్ రహీంలను అరెస్టు చేశారు. వీరు దుబాయ్‌లో ఉన్న ప్రధాన సైబర్ ముఠాలకు బ్యాంక్ ఖాతాలు తెరిచి ఇచ్చి, సైబర్ మోసం ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించి 15 శాతం కమీషన్ తీసుకుని మిగతా మొత్తాన్ని హవాలా మార్గంలో ముఠా సూత్రధారులకు పంపిస్తున్నట్లు తేలింది.
పోలీసుల విచారణలో ఈ ఇద్దరు తెరిచిన బ్యాంక్ ఖాతాల్లో దాదాపు రూ.3.60 కోట్ల రూపాయలు సైబర్ చీటింగ్ ద్వారా జమ అయినట్లు గుర్తించారు. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన 22 సైబర్ మోసాల కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని సైబర్ క్రైం అధికారులు తెలిపారు.









