వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రానికి చెందిన ఓ యువతి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోపాల్‌పేట ఎస్‌ఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన యాప చెట్టు బాలమ్మ, చిన్న గట్టయ్య చిన్న కుమార్తె యాప చెట్టు నాగలక్ష్మి (24) సుమారు నాలుగు నెలల క్రితం వనపర్తికి వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది.
అయితే నాగలక్ష్మి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గ్రామంలో, బంధువుల ఇళ్లలో, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృతంగా వెతికినా ఆమె ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
చివరకు సోమవారం నాగలక్ష్మి తల్లి యాప చెట్టు బాలమ్మ గోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ నరేష్ కుమార్ వెల్లడించారు.
యువతి అదృశ్యంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని, సమాచారం ఉన్న వారు పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ ఘటన గోపాల్‌పేట మండలంలో కలకలం రేపింది.









