దుకాణాల్లో అక్రమంగా విక్రయిస్తున్న నిషేధిత చైనా మంజాను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లో వేర్వేరుగా నిర్వహించిన దాడుల్లో మొత్తం 54 చైనా మంజా రీల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు సీసీఎస్ సీఐ బుద్దే రవీందర్ తెలిపారు. నిషేధం ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు రహస్యంగా చైనా మంజాను విక్రయిస్తున్నారని ఆయన అన్నారు.
చైనా మంజా వాడకం వల్ల మనుషులకు మాత్రమే కాకుండా పక్షులకు కూడా తీవ్ర ప్రమాదం పొంచి ఉందని సీఐ రవీందర్ హెచ్చరించారు. గతంలో చైనా మంజాతో గొంతు కోసుకుపోయిన ఘటనలు, వాహనదారులకు తీవ్ర గాయాలు అయిన సందర్భాలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. అందుకే ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ప్రభుత్వం చైనా మంజాను పూర్తిగా నిషేధించిందన్నారు.
వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో గాలి పటాలను ఎగురవేయకూడదని ప్రజలకు సూచించారు. ముఖ్యంగా చైనా మంజా వాడటం వల్ల తలెత్తే అనర్ధాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. చిన్నపిల్లల ప్రాణాలకు కూడా ఇది ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.
ఎవరైనా చైనా మంజా విక్రయించినా, అక్రమ రవాణా చేసినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలను సీఐ కోరారు. ప్రజల సహకారంతోనే ఈ అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టవచ్చని ఆయన తెలిపారు. చైనా మంజా నిర్మూలన కోసం సోదాలు, దాడులు నిరంతరం కొనసాగుతాయని సీసీఎస్ పోలీసులు స్పష్టం చేశారు.









