ఈ ఏడాది రష్యా నుంచి భారత్‌కు భారీ స్థాయిలో మద్యం దిగుమతులు జరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాదితో పోలిస్తే 2025 తొలి పది నెలల్లో భారత్‌కు రష్యా స్పిరిట్స్ ఎగుమతులు దాదాపు నాలుగు రెట్లు పెరిగినట్లు రష్యా వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ఫెడరల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ వెల్లడించింది. ఈ పెరుగుదల రష్యా ఎగుమతిదారులకు భారత్‌ను అత్యంత కీలక మార్కెట్‌గా మార్చింది.
రష్యాకు చెందిన ప్రముఖ ఆర్థిక, వాణిజ్య దినపత్రిక ‘వెడొమోస్టి’ ఈ అంశాన్ని విశ్లేషిస్తూ, భారత మార్కెట్ రష్యా వోడ్కా, జిన్, విస్కీ, లిక్కర్‌లకు వేగంగా విస్తరిస్తోందని పేర్కొంది. 2025 మొదటి పది నెలల కాలంలో రష్యా ఎగుమతిదారులు సుమారు 520 టన్నుల ఆల్కహాలిక్ స్పిరిట్స్‌ను భారత్‌కు ఎగుమతి చేశారు.
ఈ ఎగుమతుల మొత్తం విలువ రూ. 8 కోట్లకు పైగా ఉండగా, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పరిమాణంలో మూడు రెట్లు, విలువ పరంగా దాదాపు నాలుగు రెట్లు పెరిగినట్లు వెల్లడైంది. రష్యా నుంచి భారత్‌కు వచ్చిన మొత్తం మద్యం ఎగుమతుల్లో వోడ్కా అగ్రస్థానంలో నిలిచింది.
వోడ్కా మాత్రమే దాదాపు రూ. 6.82 కోట్ల విలువైన ఎగుమతులతో కీలక పాత్ర పోషించినట్లు ‘వెడొమోస్టి’ నివేదించింది. వినియోగదారుల అభిరుచుల్లో మార్పు, అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలు పెరగడం వల్ల భారత్ రష్యా ఆల్కహాలిక్ డ్రింక్స్‌కు లాభదాయకమైన మార్కెట్‌గా ఎదుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








