నూతన సంవత్సర వేడుకల కోసం రోడ్లపై హంగామా, హద్దుమీరింపు జరిగితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో క్రిస్మస్, న్యూ ఇయర్ భద్రతా ఏర్పాట్లపై ఆయన స్థానిక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, హాట్ స్పాట్లలో సిబ్బందిని మోహరించాలని సూచించారు.
డిసెంబర్ 31 రాత్రి నగరంలోని 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని సీపీ తెలిపారు. ఈ పని కోసం అదనపు 7 ప్లాటూన్ల బలగాలను రంగంలోకి దించారని చెప్పారు. మోతాదు మించి వాహనాలు నడిపితే వాహన సీజ్, రూ.10,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వత రద్దు వంటివి తప్పవని హెచ్చరించారు.
పబ్‌లు, హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఇవ్వబడుతుందని, శబ్ద కాలుష్య నియమాలను కచ్చితంగా పాటించాలని సీపీ స్పష్టం చేశారు. మాదకద్రవ్యాలు, అశ్లీల నృత్యాలు ఉంటే యాజమాన్యాలే బాధ్యత వహించాలని, లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. రద్దీ ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, జంక్షన్‌లలో మోఫ్టీ 15 షీ టీమ్స్ నిఘా ఉంచుతాయని, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే తక్షణమే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ, సురక్షితంగా 2026 ను స్వాగతించాలన్నారు.









