విద్యార్థుల్లో టీమ్ స్పిరిట్ పెంచుతున్న స్పోర్ట్స్ మీట్

Sports meet at Algold TMRIES, Zaheerabad saw participation of 1000 students from 10 colleges, promoting confidence, teamwork and sportsmanship.

ఆటల పోటీలు విద్యార్థుల్లో టీమ్ స్పిరిట్‌ను పెంపొందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని టేమ్రిస్ రీజినల్ కోఆర్డినేటర్ బహుమతి అన్నారు. జహీరాబాద్ మండలంలోని అల్గోల్డ్ టేమ్రిస్ కళాశాలలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్‌కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాలు అందించారు. విద్యార్థులు క్రీడల ద్వారా క్రమశిక్షణ, సహకారం, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు.

ఈ స్పోర్ట్స్ మీట్‌కు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 10 కళాశాలల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొనడం విశేషం. క్రీడా పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తాయని, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం పెంపొందుతుందని ఆర్ఎల్సీ పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

కళాశాల ఆవరణలో ఇండోర్ మరియు ఔట్‌డోర్ గేమ్స్‌గా కబడ్డీ, కోకో, వాలీబాల్, ఫుట్‌బాల్, రన్నింగ్, చెస్, టెన్నికాయిట్ వంటి వివిధ క్రీడా విభాగాల్లో ఉత్సాహంగా పోటీలు జరుగుతున్నాయి. విద్యార్థులు పూర్తి స్థాయిలో పాల్గొంటూ క్రీడాస్ఫూర్తిని చాటుతున్నారు. ఈ పోటీలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని కూడా పెంపొందిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ వసీముద్దీన్, ప్రిన్సిపల్ షహనాజ్ బేగం, సీఓఈ ఇన్‌చార్జి కలిముద్దీన్ సిద్ధికి జమీల్, ప్రశాంత్ గౌడ్‌తో పాటు వివిధ కళాశాలల నుంచి వచ్చిన పీడీలు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థులు జీవితంలో గెలుపు సాధించే దిశగా ముందుకు సాగాలని నిర్వాహకులు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share