రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్)లకు తోడు మూడో డిస్కమ్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇంధన శాఖ బుధవారం జీఓ నంబర్ 44ను విడుదల చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్‌పీడీసీఎల్ 15 జిల్లాలకు, ఎన్‌పీడీసీఎల్ 18 జిల్లాలకు విద్యుత్ పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. వ్యవసాయం సహా పలు వర్గాలకు ఉచిత, సబ్సిడీ విద్యుత్ సరఫరా కారణంగా సగటు బిల్లింగ్ రేటు, సేవల వ్యయం మధ్య తేడా పెరిగి డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి క్రమంగా బలహీనపడిందని ప్రభుత్వం గమనించింది.
ఈ ఆర్థిక పరిమితుల కారణంగా డిస్కమ్‌లు అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని జీఓలో పేర్కొన్నారు. రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ వంటి కీలక మౌలిక వసతుల కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో పాల్గొనలేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన, విశ్వసనీయ విద్యుత్ సరఫరా లక్ష్యం ఆలస్యమవుతున్నట్లు స్పష్టం చేశారు.
ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం మద్దతు ఇచ్చే నిర్దిష్ట వినియోగదారుల వర్గాలకు విద్యుత్ రిటైలింగ్ బాధ్యతలు నిర్వహించేలా మూడో డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను జీఓకు అనుబంధంగా పొందుపరిచినట్లు వెల్లడించారు. మూడో డిస్కమ్ ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీలను ప్రభుత్వం ఆదేశించగా, ఈ ఉత్తర్వులను రాష్ట్ర గవర్నర్ పేరుతో ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ జారీ చేశారు.









