కేంద్ర ప్రభుత్వం దేశంలోని 134 కోట్ల మంది ఆధార్ వివరాలు సురక్షితంగా ఉన్నట్లు పార్లమెంటులో స్పష్టం చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు. UIDAI డేటాబేస్లోని ఆధార్ హోల్డర్ల సమాచారం ఎలాంటి దుర్వినియోగానికి గురికాలేదని స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్లో సుమారు 134 కోట్ల మంది నమోదు ఉన్నారని, ఇప్పటివరకు 16 వేల కోట్లకు పైగా అథంటికేషన్ లావాదేవీలు విజయవంతంగా జరిగాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇది ఆధార్ వ్యవస్థ సురక్షితంగా మరియు సమర్థవంతంగా పనిచేస్తున్నదని సూచిస్తోంది.
ఆధార్ డేటా భద్రత కోసం UIDAI మల్టీ-లెవెల్ “డిఫెన్స్ ఇన్ డెప్త్” విధానాన్ని అమలు చేస్తోందని వెల్లడించారు. డేటా ట్రాన్స్ఫర్ మరియు స్టోరేజీ సమయంలో ఎన్క్రిప్షన్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు, కేంద్ర మంత్రి వివరించారు.
అదనంగా, నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ పర్యవేక్షణతో పాటు స్వతంత్ర ఆడిట్ ఏజెన్సీలు కూడా ఆధార్ వ్యవస్థను నిరంతరం పరిశీలిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల UIDAI డేటా భద్రత మరింత కఠినంగా అమలులో ఉందని కేంద్రం హైలైట్ చేసింది.








