ఉస్మానియా యూనివర్సిటీ పీజీ మహిళా హాస్టల్లో మెస్ ఇన్‌చార్జి వినోద్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణల్లో స్పష్టత లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద స్పష్టం చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో బుధవారం ఆమె ఓయూ క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థినులతో సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేర్‌టేకర్ వినోద్‌పై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నట్లు ఆమె తెలిపారు. గత రెండు మూడు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకే ముందుగా కోఠిలోని మహిళా యూనివర్సిటీని, అనంతరం ఓయూ క్యాంపస్‌ను సందర్శించినట్లు వెల్లడించారు.
విద్యార్థినులు చేసిన ఆరోపణల మాదిరిగా ఇక్కడ ఏమీ జరగలేదని పలువురు విద్యార్థినులు తమకు తెలిపినట్లు నేరెళ్ల శారద చెప్పారు. తాము మాట్లాడిన విద్యార్థినుల్లో ఎవరూ షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేయలేదని, అసలు ఎవరు ఫిర్యాదు చేశారో కూడా తెలియదని వారు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం ఒక స్టూడెంట్ గ్రూప్ యూనియన్‌కు చెందిన కొందరు నాయకులు కావాలనే చేస్తున్న చర్యగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్న అమ్మాయి ఐడీ కూడా ఫేక్ అనే సమాచారం ఉందని, దీనిపై కూడా విచారణ జరుగుతోందని నేరెళ్ల శారద తెలిపారు. నిజంగా అన్యాయం జరిగిందని స్పష్టమైన ఆధారాలు లభిస్తే మహిళా కమిషన్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మెస్ ఇన్‌చార్జి తప్పు చేసినట్లు తేలితే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.









