తెలంగాణలో నేడు చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొనగా, ఒక్క ఓటు తేడాతో ఫలితం మారడంతో పరిస్థితి అదుపు తప్పింది.
కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థికి, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి మధ్య కేవలం ఒక్క ఓటు తేడా రావడంతో ఇరు వర్గాల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లేందుకు వారు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిని గమనించిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేపట్టారు. అయితే గ్రామస్తులు పోలీసుల చర్యకు ఎదురుతిరిగి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎస్ఐతో పాటు పలువురు కానిస్టేబుల్స్‌కు గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా అదనపు పోలీసు బలగాలను భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉద్రిక్తతలు తగ్గిన అనంతరం కౌంటింగ్ ప్రక్రియను మళ్లీ కొనసాగిస్తున్నారు. గ్రామంలో ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, అధికారులు అప్రమత్తంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.









