గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం

Congress-backed candidates secured a majority of Sarpanch posts in the third phase of Telangana Panchayat elections.

తెలంగాణ రాష్ట్రంలో నేడు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతుండగా, ఈ విడతలోనూ కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. మొత్తం 4,158 సర్పంచ్ స్థానాల్లో అనేక జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు భారీ సంఖ్యలో విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాల్‌పల్లి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు ఎక్కువ స్థానాలను కైవసం చేసుకున్నారు.

రాత్రి 7 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం ఏకగ్రీవాలను కలుపుకుని కాంగ్రెస్ 1,760 సర్పంచ్ స్థానాలను దక్కించుకుంది. అదే సమయంలో బీఆర్ఎస్ 900 స్థానాలు, బీజేపీ 165 స్థానాలు గెలుచుకోగా, ఇతరులు 360 స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలు గ్రామీణ రాజకీయాల్లో కాంగ్రెస్ బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మూడో విడతలో మొత్తం 182 మండలాల్లో 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల కాగా, 11 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,752 సర్పంచ్ స్థానాలకు బుధవారం పోలింగ్ జరగగా, అనేక చోట్ల ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. పూర్తి ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share