విశ్రాంత ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండ

MLA Veerlapalli Shankar attended Pensioners Day in Shadnagar and praised retired employees for their service to society.

జీవితకాలంలో సింహభాగం ప్రభుత్వంలో భాగమై ప్రజా సేవ చేసి పదవి విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ తాలూకా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పెన్షనర్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదవి విరమణ అనంతరం కూడా సమాజ హితం కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్న విశ్రాంత ఉద్యోగులు అభినందనీయులని అన్నారు. ప్రభుత్వ సేవలో ఉన్న సమయంలోనే కాకుండా, రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు.

తమ జీవితకాలంలో సింహభాగాన్ని ప్రభుత్వ సేవకే అంకితం చేసిన ఉద్యోగులు, పదవీ విరమణ అనంతరం ఒక సంఘంగా ఏర్పడి సేవా భావంతో ముందుకు సాగడం అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే తెలిపారు. వారి అనుభవం, సేవా తత్వం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు.

రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్లు తదితర అంశాల్లో విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్యే స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు, జిల్లా అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share