కాంగ్రెస్–పీకే మధ్య కొత్త వ్యూహమా?

Prashant Kishor’s meeting with Priyanka Gandhi after three years sparks fresh political speculation.

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీతో కీలక భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2022లో కాంగ్రెస్‌తో విభేదాల అనంతరం మూడేళ్ల తర్వాత ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ వెనుక అసలు రాజకీయ ఉద్దేశం ఏమిటన్న దానిపై జాతీయ స్థాయిలో విశ్లేషణలు మొదలయ్యాయి.

ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా ఎదుర్కొంటున్న ఎన్నికల పరాజయాలు, మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సూరజ్ పార్టీ దారుణంగా విఫలమవడం ఈ భేటీకి నేపథ్యంగా మారినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ సమావేశం ఇరువురికీ రాజకీయంగా కీలక మలుపు కావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో కాంగ్రెస్‌పై బహిరంగంగా విమర్శలు చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన వైఖరిని పునరాలోచిస్తున్నారన్న సంకేతాలు ఈ భేటీ ద్వారా కనిపిస్తున్నాయని చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌తో మళ్లీ వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా అడుగులు పడుతున్నాయా? లేక భవిష్యత్తు రాజకీయ సమీకరణలకు ఇది తొలి అడుగేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇదే సమయంలో ఇటీవల జరిగిన ఓటు చోరీ నిరసన కార్యక్రమంలో ప్రధాని మోదీని గద్దె దించుతామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వేడి పుట్టించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయ వ్యూహానికి తెరలేపినట్లు సమాచారం. ప్రియాంక గాంధీ–ప్రశాంత్ కిషోర్ భేటీ రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ఏ విధమైన మార్పులకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share