హస్తినాపురం డివిజన్ పరిధిలోని టీకేఆర్ కాలేజీ రోడ్డుపై ఉన్న నందనవనం భువనేశ్వరి ఆయిల్ మిల్లులో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నాణ్యత లేని ఆయిల్స్ తయారీతో పాటు కల్తీ ఆయిల్స్‌ను మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న ఇటువంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
జీహెచ్ఎంసీ సరూర్‌నగర్ ఫుడ్ సేఫ్టీ అధికారి మౌనిక ఆధ్వర్యంలో అధికారులు సోమవారం సాయంత్రం ఆయిల్ మిల్లులో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ నిల్వ ఉంచిన వివిధ రకాల వంట నూనెలకు సంబంధించిన శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. గత కొంతకాలంగా ఈ ఆయిల్ మిల్లుపై కల్తీ ఆయిల్స్ సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
అలాగే సరైన బిల్లులు, రసీదులు లేకుండానే ఆయిల్‌ను రవాణా చేయడం, విక్రయాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం కూడా వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఆయిల్ అమ్మకాలు జరుగుతున్నాయన్న అనుమానంతో అధికారులు పలు రికార్డులు, డాక్యుమెంట్లను పరిశీలించారు. ఆయిల్ నిల్వ విధానం, తయారీ ప్రక్రియపై కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ సందర్భంగా స్థానిక బస్తీవాసులు స్పందిస్తూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇటువంటి ఆయిల్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ల్యాబ్ నివేదికలు వచ్చిన వెంటనే బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.









