బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నందనగర్ నివాసంలో కలిశారు. ఇద్దరి మధ్య జరిగిందీ భేటీలో తాజా జాతీయ రాజకీయ పరిణామాలు, రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు, విభిన్న పార్టీలు ఎదుర్కొంటున్న సవాళ్లు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ ధోరణుల నేపథ్యంలో పార్టీలు ప్రజలతో మరింత సాన్నిహిత్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఇరువురు అభిప్రాయపడ్డారు.
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అఖిలేష్ యాదవ్, రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని పేర్కొన్నారు. కొన్నిసార్లు ప్రజలు ఆమోదిస్తారనీ, కొన్నిసార్లు తిరస్కరిస్తారనీ, ఏ పరిస్థితుల్లోనైనా ప్రజల్లో ఉంటూనే రాజకీయ పయనం కొనసాగాలని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతిపక్షానిదేనని, బలమైన వాదనతో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు నిలదీయడం ముఖ్యం అని అన్నారు. త్వరలో కేసీఆర్‌ను కూడా కలుస్తానని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అఖిలేష్ యాదవ్ తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో కలిశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పరిపాలన సాగుతున్న విధానం వంటి విషయాలను రేవంత్ రెడ్డి ఆయనకు వివరించారు. వివిధ రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై, కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై కూడా ఇరువురు నేతలు సమగ్రంగా చర్చించుకున్నట్లు సమాచారం.
ఈ రెండు కీలక భేటీలతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. అఖిలేష్ యాదవ్ వరుసగా కేటీఆర్, రేవంత్ రెడ్డి వంటి నేతలను కలవడం వల్ల భవిష్యత్ రాజకీయ సమీకరణలు ఎలా ఉండబోతున్నాయనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రాంతీయ పార్టీల మధ్య సహకార రాజకీయాలపై ఈ సమావేశాలు సూచిస్తున్న సందేశం ఏమిటన్న దానిపై కూడా విశ్లేషణలు మొదలయ్యాయి.









