పెద్ద చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా చెరువును పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని బాలాపూర్ పెద్ద చెరువును ఆమె శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువులో చెత్త పేరుకుపోకుండా, వృక్షాలు ఎండిపోకుండా, రోజు వారీగా నీరుపోసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువు అభివృద్ధి పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో పెద్ద చెరువు అభివృద్ధికి రూ.4 కోట్ల నిధులు వేసినట్లు గుర్తుచేశారు. గతంలో చెరువు సుందరీకరణ కోసం ప్రత్యేకంగా నిధులు కోరిన ప్రపోజల్‌ను ప్రభుత్వం పరిశీలించి, ఇప్పుడు రూ.2.25 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో చెరువులో వెలువడుతున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన పనులు చేపడతామన్నారు.
ప్రస్తుతం చెరువులో డ్రైనేజ్ నీరు చేరకుండా ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు, మలినాలను శుద్ధి చేసేందుకు ఎస్‌టీపీ నిర్మాణం చేపట్టనున్నట్లు సబితా వెల్లడించారు. అలాగే చెరువు చుట్టుపక్కల బండ్‌ను బలోపేతం చేసి, పరిసరాలను అందంగా తీర్చిదిద్దేందుకు నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. చెరువు వద్ద శాశ్వత సిబ్బందిని నియమించాలని కమిషనర్‌కు సూచిస్తూ, చెరువు నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావు ఇవ్వొద్దని స్పష్టం చేశారు.
ఈ సందర్శన కార్యక్రమంలో బడంగ్‌పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సరస్వతి, ఇరిగేషన్ శాఖ అధికారులు, స్థానిక నాయకులు ఒంగేటి లక్ష్మారెడ్డి, కళ్లెం ఎల్లారెడ్డి, గుండోజి రఘునందన్ చారి, చిగురింత పెద్ద నరసింహారెడ్డి, తిమ్మని గిరేష్, గోపాల్ నాయక్, మున్నా, రిథన్ రెడ్డి, పాండు, గిరి ముదిరాజ్, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి, పెద్దబావి ఆనంద్ రెడ్డి, కామేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెరువు అభివృద్ధిపై ప్రజల అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.









