దేశంలోనే తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంశాన్ని లోతుగా విశ్లేషించి పుస్తకాలు రచించిన జర్నలిస్టు ముద్దం స్వామికి ప్రశంసలు లభిస్తున్నాయి. గురువారం ఆయన రచించిన ఏఐ ఫర్ యంగ్ మైండ్స్, ఏఐ ఇన్ మోడరన్ జర్నలిజం, ఆధునిక జర్నలిజం – ఏఐ పుస్తకాలను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ప్రత్యేకంగా అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిజం రంగంలో ఏఐ అవసరం, భవిష్యత్ మీడియా మార్పులు, నూతన టెక్నాలజీలపై స్వామి చేసిన అధ్యయనంపై పాల్గొన్న ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.
పుస్తకాలను స్వీకరించిన మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇవి తెలంగాణ యువతకు, ముఖ్యంగా జర్నలిజం మరియు టెక్నాలజీ రంగాలకు ప్రాధాన్యతనిచ్చే పుస్తకాలన్నీ అన్నారు. ఈ ఏఐ పుస్తకాల ఆవిష్కరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా విడుదల చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి వెల్లడించారు. నేటి యుగంలో ఏఐ ఆధారిత నైపుణ్యాలు అత్యంత కీలకం కావడంతో ఇలాంటి రచనలు మరింత మంది యువతలో టెక్నాలజీపై ఆసక్తిని పెంపొందిస్తాయని అన్నారు.
టెలంగాణ ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నదని, ప్రపంచ స్థాయి ఏఐ యూనివర్సిటీని భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయడానికి చర్యలు వేగవంతం చేస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. భవిష్యత్తు పరిశ్రమలకు అవసరమైన హైఎండ్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ యూనివర్సిటీ కీలక కేంద్రంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏఐ ఆధారిత స్టార్టప్స్, టెక్ కంపెనీలను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నట్లు కూడా వివరించారు.
కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.ప్రీతం, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, మాచర్ల కుమారస్వామి, బిజిగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వామి ముద్దం ఏఐ పుస్తకాలు భవిష్యత్ జర్నలిస్టులకు మార్గదర్శకంగా నిలుస్తాయని పలువురు అతిథులు అభినందించారు.









