మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఎస్పీ డా. శబరీష్ సందర్శించారు. రేపటి పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులు మరియు సిబ్బందికి పూర్తి అప్రమత్తతతో ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో 163 సెక్షన్లు, బి.ఎన్.ఎస్.ఎస్ అమల్లో ఉంటాయని, ప్రతి కేంద్రం పరిధిలో ప్రత్యేక నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
పోలింగ్ కేంద్రాల లోపల సెల్ ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇంక్ బాటిళ్లు, ఆయుధాలు, పెన్నులు వంటి వస్తువులను తీసుకురావడానికి అనుమతి ఉండదు. ఓటర్లు క్యూ లైన్ పద్ధతిని పాటించి, పోలీసులకు సహకరించాలని ఎస్పీ సూచించారు. పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే కేంద్రాల్లోకి ప్రవేశం అనుమతిస్తారు, ఓటర్లు తప్పనిసరిగా తమ ఐడి కార్డులు తీసుకురావాలి.
సోషల్ మీడియాలో రచ్చపెట్టి ప్రజలను ప్రలోభపెట్టే పోస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రచారం ముగిసిన తర్వాత గ్రామాల్లోకి అనుమానాస్పద వ్యక్తులు రాకూడదని, ఏవైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఆహ్వానించారు.
ఎస్పీ డా. శబరీష్ ఎన్నికల అనంతరం గందరగోళం, అల్లర్లు, విజయోత్సవ ర్యాలీలను జరపకూడదని హెచ్చరించారు. ప్రజల్లో భరోసా కలిగే, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేయడానికి పోలీస్ సిబ్బంది కఠినంగా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు.









