డీఎస్పీపై ప్రేమ మోసం ఆరోపణలతో కలకలం

A Karnataka businessman alleged that DSP Kalpana cheated him in the name of love, taking ₹2 crore, jewellery and hotel ownership, sparking major controversy.

కర్ణాటకలోని రాయ్‌పూర్‌లో ఒక వినూత్నమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో మోసపోయామని యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయడం సాధారణమే కానీ, ఓ వ్యాపారవేత్త నేరుగా డీఎస్పీపై మోసం ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. వ్యాపారవేత్త దీపక్ టాండన్ దాఖలు చేసిన ఫిర్యాదు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో విషయం మరింత దృష్టిని ఆకర్షిస్తోంది.

ఫిర్యాదులో దీపక్, డీఎస్పీ కల్పన వర్మ 2021లో ప్రేమ పేరుతో తనను నమ్మించిందని, ఈ నమ్మకాన్ని దుర్వినియోగం చేసి తన దగ్గర నుంచి రూ.2 కోట్ల వరకు డబ్బు తీసుకుందంటూ పేర్కొన్నాడు. అలాగే డైమండ్ రింగ్, గోల్డ్ చైన్, లగ్జరీ గిఫ్ట్స్ మాత్రమే కాదు, తన హోటల్ ఓనర్‌షిప్ కూడా రాయించుకుందని సంచలన ఆరోపణలు చేశాడు. తన ప్రేమను నమ్మి ఇవన్నీ ఇచ్చానని, కానీ తరువాత ఆమె ప్రవర్తన మారిపోయిందని వివరించాడు.

అంతేకాకుండా ఇప్పటికీ తాను ఇచ్చిన వాటిని తిరిగి ఇవ్వకుండా, పైగా తనపై క్రిమినల్ కేసులు పెడతానని బెదిరిస్తోందని దీపక్ ఆరోపించాడు. ఈ ఆరోపణలతో కేసు నమోదు కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఒక అధికారిపై ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక మోసం ఆరోపణలు రావడంతో శాఖలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చలు మొదలయ్యాయి.

ఈ ఆరోపణలకు డీఎస్పీ కల్పన వర్మ బలంగా ప్రతిస్పందించారు. ఆమె తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ, “నాకు ఎవరి నుండి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి, నాపై బురద జల్లడానికి కొందరు ఇలా చేస్తున్నరు” అని తెలిపారు. నిజానిజాలు వెలుగులోకి రావడానికి దర్యాప్తుకు తాము సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share