వైద్య విధాన పరిషత్ రద్దు కోరుతున్న ఉద్యోగులు

Employees demand scrapping of VVP and creation of the Directorate of Secondary Health Services, citing delayed salaries and lack of recognition.

తుంగతుర్తి ఏరియా ఆసుపత్రి సిబ్బంది బుధవారం కీలకనిర్ణయం తీసుకున్నారు. వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి దాని స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, ఆర్ఎంఓ డాక్టర్ ఉపేందర్‌కు సంతకాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఆరోగ్య రంగంలో కీలకమైన సేవలు అందిస్తున్నప్పటికీ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం, దాంతో ప్రతి నెలా వేతనాలు ఆలస్యంగా రావడం తీవ్ర సమస్యగా మారిందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటి పరిస్థితుల్లో వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న ఉద్యోగులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. వేతనాలు సమయానికి అందక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఇతర శాఖల ఉద్యోగులతో పోలిస్తే తమకు న్యాయం జరగడం లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లిస్తే మాత్రమే ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని వారు తెలిపారు.

గతంలో వైద్య విధాన పరిషత్ ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి చేపట్టిన పోరాటం తర్వాత ప్రభుత్వం స్పందించి, పరిషత్‌ను రద్దు చేసి సెకండరీ హెల్త్ సర్వీసెస్‌ డైరెక్టరేట్ ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం ఉద్యోగులు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన కమిటీ అవసరమైన విధి విధానాలతో కూడిన నివేదికను సంవత్సరం క్రితమే సమర్పించినప్పటికీ, ఇప్పటికీ అమలు చేయకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో సెకండరీ హెల్త్ సర్వీసెస్‌ను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా శాస్త్రీయ ప్రమాణాల ప్రకారమే సిబ్బంది సంఖ్యను ప్రతిపాదించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిషత్ రద్దు–డైరెక్టరేట్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్, సువర్ణ, నాగమణి, అనిత, నర్సింగ్ ఆఫీసర్స్, కవిత తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share