పదవిలోకి వచ్చిన వెంటనే జిల్లా డీసీసీ అధ్యక్షులు సీనియర్ నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులతో సమన్వయం సాధిస్తూ పని చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించిన ఆరు నెలల పనితీరు గడువు ప్రతి డీసీసీ గుర్తుంచుకోవాలని, ఆ సమయానికి పార్టీ బలోపేతంలో స్పష్టమైన పురోగతి కనిపించాల్సిందేనని హితవు పలికారు. సమన్వయంతో పనిచేస్తేనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్లో జరిగిన జూమ్ మీటింగ్లో పీసీసీ చీఫ్ డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్లు, అనుబంధ సంఘాల నేతలతో మాట్లాడారు. నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులను అభినందించిన మహేష్ గౌడ్, జిల్లా స్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి, నాయకత్వ బలోపేతానికి అందరూ కట్టుబడి పనిచేయాలని సూచించారు. పార్టీ నిర్ణయించిన బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని గుర్తు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘ఓట్ చోర్’ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ, అధిక సంఖ్యలో ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని డీసీసీలకు సూచించారు. పార్టీ లక్ష్యాలు, విధానాలు గ్రామస్థాయిలో చేరేలా కొత్తగా నియమితులైన నాయకులు చురుకైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
డిసెంబర్ 14న ఢిల్లీలో జరగనున్న ‘ఓట్ చోర్ మహా ధర్నా’ను భారీ విజయంగా మార్చేందుకు అన్ని విభాగాల నేతలు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని మహేష్ గౌడ్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులను గుర్తించి, వారికి తగిన మద్దతు ఇవ్వాలని సూచించారు. బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు పార్టీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేయడమే రాబోయే ఎన్నికల విజయానికి మార్గమని ఆయన స్పష్టం చేశారు.









