సోనియా గాంధీకి కోర్టు నోటీసులు

Delhi’s Rouse Avenue Court issued a notice to Sonia Gandhi over a plea alleging her name was added to voter rolls before she became an Indian citizen.

జన్మదిన వేడుకల మధ్యలోనే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. 1980–81లో న్యూ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో సోనియా పేరు చేర్చిన అంశంపై దాఖలైన ఫిర్యాదును తిరస్కరించిన మ్యాజిస్ట్రేట్ కోర్టు తీర్పుపై రివిజన్ పిటిషన్ విచారణలో భాగంగా ఈ చర్య తీసుకుంది. పిటిషన్‌లో ఉన్న ఆరోపణల తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటూ కోర్టు స్పందన కోరింది.

న్యాయవాది వికాస్ త్రిపాఠి చేసిన ఫిర్యాదులో, సోనియా గాంధీ 1983 ఏప్రిల్ 30నే భారత పౌరసత్వం పొందినా, అంతకుముందే ఆమె పేరు ఓటర్ల జాబితాలో ఉందని పేర్కొన్నారు. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్‌తో పాటు IPC/BNS నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై సెప్టెంబర్ 2025లో మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపి, సరైన ఆధారాలు లేవన్న కారణంతో కేసును కొట్టివేసింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వికాస్ త్రిపాఠి రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ రివిజన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు సెషన్స్ జడ్జి విశాల్ గోగ్నే, ముందుగా ఢిల్లీ పోలీసుల నుంచి పూర్తి వివరాలు, స్పందన ఇవ్వాలని ఆదేశించారు. అలాగే మ్యాజిస్ట్రేట్ కోర్టు రికార్డులు (TCR) కూడా సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పౌరసత్వం రాకముందే ఓటర్ జాబితాలో పేరు ఎలా చేరిందన్నదానిపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని సోనియా గాంధీకి నోటీసులు పంపించారు.

ఈ కేసు రాజకీయ, చట్టపరమైన పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటర్ల జాబితాలో పేరు చేర్చడంపై ఉన్న నిబంధనలు, పౌరసత్వానికి సంబంధించిన చట్టాలు ఇక్కడ ప్రధాన అంశాలుగా మారాయి. సోనియా గాంధీ స్పందన తర్వాత విచారణ వేగం పెరగనుంది. కేసులో తదుపరి హియరింగ్‌ తేదీగా 2026 జనవరి 6ను కోర్టు నిర్ణయించింది. రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share