టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక హామీ ఇస్తూ, బీసీ యువకులు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అంబర్‌పేట్‌లో బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మాహుతికి పాల్పడిన సాయి ఈశ్వరాచారి ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశ్వరాచారి మృతి తీవ్రంగా కలిచివేసిందని, ఇలాంటి ఘటనలు మరలా జరగకూడదన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు.
ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని ప్రధాన అజెండాగా పెట్టుకుని పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, బీసీ వర్గాల న్యాయబద్ధ హక్కుల సాధన కోసం ప్రతి వేదికలో ధ్వనిస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ద్వారా బీసీ రిజర్వేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మహేశ్ గౌడ్ నమ్మకంగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మాదిరిగానే బీసీ కోటాలను కూడా రాజ్యాంగపరంగా అమలు చేయడంలో కాంగ్రెస్ వెనకాడదని పేర్కొన్నారు. ఈశ్వరాచారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో బీసీ బిల్లులను చట్టసభల్లో ఆమోదించినప్పటికీ, కేంద్రం వాటిని పక్కన పెట్టిందని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బీసీ రిజర్వేషన్ల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. త్వరలోనే సీఎం నేతృత్వంలో ప్రధానిని కలిసి బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వచ్చేలా ఒత్తిడి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు.









