స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా గంగాధర మండలంలో సర్పంచ్ పదవులు ‘కాస్లీ’గా మారిపోయాయని ప్రజల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా గంగాధర, మధురానగర్, బూరుగుపల్లి, గర్శకుర్తి, గట్టుభూత్కూర్ గ్రామాల్లో ఎన్నికలు సమీపించగా అభ్యర్థులు భారీగా ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. గ్రామస్తుల వివరాల ప్రకారం, గత సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది. ఈసారి పరిస్థితులు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్థానికంగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, గంగాధర గ్రామంలో వారసంత మండల కేంద్రంలో జరిగే వారసంత ద్వారా యేడాదికి 1.5 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు తెలిపారు. గట్టుభూత్కూర్ గ్రామం పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్ క్వారీల ద్వారా స్థిరమైన ఆదాయం ఉండటంతో సర్పంచ్ పదవిపై పోటీ తీవ్రత పెరిగింది. అభ్యర్థులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడడం లేదని స్థానికులు చెబుతున్నారు.
అదేవిధంగా మధురానగర్, బూరుగుపల్లి, గర్శకుర్తి గ్రామాల్లో భూముల ధరలు ఆకాశానంటుతున్నాయి. రియల్ ఎస్టేట్ వేగంగా పెరుగుతోందని, భూముల విలువలు అధికమవ్వడంతో గ్రామాలకు వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగిందని సమాచారం. ఈ ఆర్థిక వనరుల ప్రభావంతో సర్పంచ్ పదవిని ‘అధికార ఆర్థిక’ పరంగా ఆకర్షణీయంగా మారుస్తోంది.
స్థానికులు ప్రశ్నిస్తున్నారు, “గ్రామాల్లో ప్రాథమిక సమస్యలు అలాగే ఉన్నాయి, కానీ సర్పంచ్ పదవికి కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులు తిరిగి ఎలా వస్తాయి?” అభ్యర్థుల మధ్య పెరిగిన పోటీ, పెట్టుబడుల పరంగా సర్పంచ్ పదవి మార్కెట్ గురించి సోషల్ మీడియాలో చర్చలు వేడెక్కుతున్నాయి. ప్రజల ఆందోళన మరియు సోషల్ మీడియాలో చర్చల నేపథ్యంలో స్థానిక రాజకీయ వాతావరణం హాట్ టాపిక్‌గా మారింది.









