మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. బోయినపల్లి మండలం వరదవల్లిలో జరిగిన శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకునేందుకు ఇరువురు నేతలు మిడ్ మానేరులో ఏర్పాటు చేసిన స్పీడ్ బోట్ ద్వారా ప్రయాణించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, దత్తాత్రేయ స్వామి కృపతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. జయంతి వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతిరోజూ ఆలయానికి సౌకర్యంగా చేరేందుకు శాశ్వత బోటు సదుపాయం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని నేతలు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలోనే ఆమోదం పొందేలా కృషి చేస్తామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాలన రెండు సంవత్సరాల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజాహితాన్ని కోరే నాయకులు, కార్యకర్తలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. గ్రామాల వరకు అభివృద్ధి చేరేందుకు ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.









