నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలయ్యాక, దళితుల ఆత్మగౌరవం గురించిన చర్చ మళ్లీ ప్రధానాంశంగా మారింది. ఎన్నేళ్లుగా దళితులను పట్టించుకోని అభ్యర్థులు ఈసారి అయినా వారి సమస్యలను పరిష్కరిస్తారా అనే సందేహం గ్రామంలో ప్రతి మూలో వినిపిస్తోంది. గ్రామ రాజకీయాల్లో దళితుల భాగస్వామ్యం పేరుకే ఉండడంతో, ఈ ఎన్నికలు వారికి గౌరవం దక్కే అవకాశం ఇస్తాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గ్రామంలో ఇప్పటికీ దళితులకు గుడి ప్రవేశం నిషేధంగా ఉండటమే కాక, పీర్ల పండుగలో అలావు దుంకడాన్ని కూడా నిరోధిస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై ఎన్నోసార్లు సమావేశాలు, చర్చలు జరిగినప్పటికీ, కొంతమంది కులస్తులు తమ వైఖరిని మార్చడానికి నిరాకరించారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ విషయాలు పెద్ద గొడవలకు దారి తీసిన సందర్భాలు కూడా గ్రామస్థులకు ఇప్పటికీ గుర్తు ఉంటాయి.
యాదిరెడ్డిపల్లిలో ఇప్పటికీ అంబేద్కర్ విగ్రహం లేకపోవడం గ్రామ దళితుల ప్రధాన అసంతృప్తి అంశంగా మారింది. గత ప్రభుత్వంలో విగ్రహం ఏర్పాటు కోసం ప్రయత్నించిన దళితులపై ఒత్తిడి, నిర్లక్ష్యం చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందా లేక మరోసారి వేలెత్తి చూపడానికే పరిమితమవుతుందా అనే చర్చ గ్రామంలో జోరుగా సాగుతోంది. కొత్తగా ఎన్నికయ్యే సర్పంచ్ అభ్యర్థులు ఈ సమస్యలను గమనిస్తున్నారో లేదో అన్నది గ్రామ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
గ్రామ సమస్యలను పక్కనబెట్టి, ఇరు ప్రధాన రాజకీయ పార్టీలు యువతను మత్తులోకి నెట్టుకొని ఓట్లు అడిగేందుకు సిద్ధమయ్యాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అసలు సమస్యలు, దళితుల గౌరవ హక్కులు, అభివృద్ధి అంశాలు ఎవరి అజెండాలోనూ కనిపించకపోవడంతో, ఈ ఎన్నికలు మరోసారి రాజకీయ లాభ నష్టాలకే పరిమితమవుతాయనే భయం వ్యక్తమవుతోంది. నిజంగా గ్రామంలో మార్పు కావాలంటే, గెలిచే అభ్యర్థి పార్టీలకే కాదు ప్రజలకే విలువ ఇచ్చే నాయకుడై ఉండాలని గ్రామ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.









