ఆంధ్రప్రదేశ్లో పేదవర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని టిడ్కో ఇళ్ల నిర్మాణం, గృహనిర్మాణ శాఖ పురోగతిని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇప్పటికే పూర్తయిన ఇళ్లను ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ విధంగా ప్రభుత్వ పనులను ప్రజలకు ప్రత్యక్షంగా చూపించి, ఆనందాన్ని పెంచడం లక్ష్యంగా ఉంది.
వచ్చే ఉగాది నాటికి ఐదు లక్షల మందికి ఇళ్ల తాళాలు అందించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ ఇళ్లు నిర్మించడం ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.
ఇప్పటివరకు మూడు లక్షలకుపైగా ఇళ్లు పూర్తిచేసి సామూహిక గృహప్రవేశాలను నిర్వహించామని తెలిపారు. 2029 జనవరి నాటికి మిగిలిన లక్ష్యాన్ని పూర్తిచేయడానికి అధికారులు వేగంగా పనిచేయాలని సీఎం సూచించారు.









