మంథని మాతా, శిశు ఆసుపత్రిలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన గైనిక్ సేవలు మళ్లీ ప్రారంభమవడం స్థానికులలో ఆనందాన్ని కలిగించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. గర్భిణీలకు అవసరమైన సేవలను సమీపంలోనే అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆసుపత్రి వసతులను అంచనా వేసి, గైనక్ విభాగాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం జరిగింది. అవసరమైన సిబ్బంది, పరికరాలు, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో తిరిగి సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.
మంథని పరిసర గ్రామాలకు చెందిన గర్భిణీలు ఇంతకు ముందు ప్రసవ, గైనిక్ సంబంధిత సేవల కోసం దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వచ్చేది. దీనివల్ల సమయం, ధనం రెండూ వృథా అవ్వడంతో పాటు గర్భిణీలకు తగిన రిస్క్ కూడా ఉండేది. ఇప్పుడు మంథని ఆసుపత్రిలోనే మళ్లీ సేవలు అందుబాటులోకి రావడంతో వారి సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయి.
గర్భిణీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. స్థానికంగా అందుతున్న నాణ్యమైన వైద్య సేవలు వారికి భరోసాను కలిగిస్తాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగం మరింత బలోపేతం కావడానికి దోహదం చేస్తాయని అధికారులు పేర్కొన్నారు.









