పుట్టపర్తిలో జరుగుతున్న శతజయంతి ఉత్సవాలకు నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా విచ్చేయడంతో ప్రాంతం మొత్తం పండుగ వాతావరణంతో మార్మోగిపోయింది. మోడీ ప్రశాంతి నిలయానికి చేరుకున్న వెంటనే అధికారులు, పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన సాయి కల్వంత్ హాల్‌లోని శ్రీ సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంలో మోడీకి వేదపండితులు వేద ఆశీర్వచనాలుతో పూర్ణకుంభ స్వాగతం అందించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనతో పాటు ఉన్నారు.
దర్శనం అనంతరం మోడీ హిల్ వ్యూ స్టేడియంకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి శతజయంతి సందర్బంగా విడుదల చేసిన 100 రూపాయల స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంపును మోడీ ఆవిష్కరించారు. ఈ చారిత్రక ఘట్టానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్య రాయ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వేదిక మొత్తం సాయిబాబా సేవలు, సిద్ధాంతాలను ప్రతిబింబించే అలంకరణలతో అలరారింది.
శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో పుట్టపర్తిలో భద్రత కట్టుదిట్టంగా అమలు చేశారు. వేలాది మంది భక్తులు ప్రశాంతి నిలయం చుట్టుపక్కల ప్రాంతాలకు తరలి వచ్చారు. ప్రత్యేక పాస్‌లతో మాత్రమే కార్యక్రమ ప్రాంగణంలో ప్రవేశం ఇవ్వగా, రాష్ట్ర మరియు కేంద్ర భద్రతా దళాలు భారీగా మోహరించాయి. రోడ్ల వెంట భక్తులు, స్వచ్ఛంద సేవకులు, సాయిసేవాదళం సభ్యులు ఉత్సాహంగా కార్యకలాపాలు నిర్వహించారు. మొత్తం పరిసరాలు ఉత్సవజోష్‌తో కళకళలాడాయి.
ఈ శతజయంతి ఉత్సవాలు నేటి నుండి ఈ నెల 23 వరకు ఘనంగా జరగనున్నాయి. భక్తుల కోసం ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు వంటి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాయిబాబా సేవా స్ఫూర్తిని మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో కార్యక్రమాలు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తుల సమక్షంలో నిర్వహించబడతాయి. పుట్టపర్తి ఈ రోజులన్నీ భక్తి, శాంతి, సేవా భావంతో నిండిపోయి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించనుంది.









