ఆకలితో కొడుకు మృతి – తండ్రి వేదన

A mentally challenged boy died of hunger, and his father, unable to afford cremation, waited for hours at the graveyard seeking help.

మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన స్థానికులను కన్నీళ్లపర్యంతం చేసింది. ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలరాజ్ సంవత్సరాలుగా పత్తిమిల్లులో పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. అయితే ఏడాది క్రితం మిల్లు మూతపడటంతో ఉపాధి కోల్పోయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. డబ్బుల కోసం తంటాలు పడుతూ భార్యతో తరచూ గొడవలు జరిగి, ఇల్లులో రోజువారీ జీవితం గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం భార్య చిన్న కుమారుడిని తీసుకొని ఇంటి నుండి వెళ్లిపోవడంతో బాలరాజ్ బాధల్లో మునిగిపోయాడు.

ఇంట్లో మిగిలింది పెద్ద కుమారుడు హరీశ్ మాత్రమే. హరీశ్‌ చిన్నప్పటి నుంచే మానసిక వైకల్యంతో పాటు వికలాంగతతో బాధపడుతున్నాడు. అతన్ని చూసుకోవడానికి, మందులు కొనడానికి బాలరాజ్ వద్ద సంపాదన లేకపోవడంతో ఇటీవల హోటల్ క్లీనింగ్ పనిలో చేరాడు. అయితే రోజుకు వచ్చే అరకొర డబ్బులతో ఇంటికి తిండి పెట్టడమే కష్టమైపోయింది. హరీశ్‌కు మందులు కొనలేక, సరైన ఆహారం ఇవ్వలేక తీవ్ర అనారోగ్యానికి గురై చివరకు సోమవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.

చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితిలో బాలరాజ్ తన కుమారుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని ప్రేమ్‌నగర్ శ్మశానవాటికకు వెళ్లాడు. ఏం చేయాలో తెలియక, ఎవరైనా సహాయం చేస్తారా అన్న ఆశతో గంటల తరబడి అక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాదాపు ఐదు గంటలపాటు మృతదేహంతో కూర్చుని ఉన్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత విచారకరంగా మారింది.

చీకటి పడుతుండటంతో స్థానికులు ఈ దృశ్యాన్ని గమనించి జడ్చర్ల వీఆర్ స్వచ్ఛంద సేవా సంస్థకు సమాచారం ఇచ్చారు. ప్రతినిధి ప్రవీణ్ వాలంటీర్లతో కలిసి సాయంత్రం ఏడు గంటలకు అక్కడికి చేరుకొని పొక్లెయిన్ సాయంతో గుంత తీయించి హరీశ్ మృతదేహాన్ని అంత్యక్రియలు చేశారు. బాలరాజ్ రెండు రోజులుగా తిండి లేక, నీరే తాగుతూ ఉన్నాడని, ఆకలితో తన కుమారుడు చనిపోగా తాను కూడా అనారోగ్యంతో ఉన్నానని చెప్పడంతో అక్కడికక్కడే ఉన్నవారు కంటతడి పెట్టారు. పేదరికం ఎంత భయంకర స్థాయికి చేరుకుంటుందో ఈ ఘటన అద్దం పడింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share