తెలంగాణ రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో సఫల ఆర్గానిక్స్ సీఈఓ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి జపాన్ పర్యటనను విజయవంతంగా కొనసాగించారు. ఐచిన్ ప్రిఫెక్చర్‌లోని ప్రముఖ వ్యాపార సంస్థల సీఈఓలతో సమావేశమై భారతదేశం, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సవివరంగా వివరించారు. ఐటీ, బయోటెక్, వ్యవసాయం, స్టార్టప్స్ రంగాల్లో తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వారికి వివరించి పెట్టుబడులను ఆకర్షించే దిశగా స్పష్టమైన సమగ్ర వివరణ ఇచ్చారు.
ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ ఎల్లారెడ్డి ఐచిన్ ప్రిఫెక్చర్ గవర్నర్ హిదెకీ ఒమురాను అధికారికంగా తెలంగాణ ప్రభుత్వ తరఫున రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించారు. దీనికి గవర్నర్ ఒమురా అత్యంత సానుకూలంగా స్పందించి త్వరలోనే తెలంగాణను సందర్శించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. నగోయా స్టార్టప్ సెంటర్‌ను సందర్శించిన అనంతరం, జపాన్ ఐటీ, బయోటెక్ రంగాల ప్రతినిధులు హైదరాబాద్‌లోని టీ-హబ్, బయోటెక్ పార్క్‌లను సందర్శించాలని డాక్టర్ ఎల్లారెడ్డి సూచించారు.
ఈ సందర్భంగా గవర్నర్ హిదెకీ ఒమురా మాట్లాడుతూ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు, వ్యాపార రంగంలో చేస్తున్న పురోగతి ప్రశంసనీయమని కొనియాడారు. గౌరవార్థం ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ డాక్టర్ ఎల్లారెడ్డిని అసెంబ్లీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టి సన్మానించడం విశేషం. ఈ ఘన సత్కార వేడుకలో జపాన్ ప్రభుత్వ పలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారి సమక్షంలో భారత–జపాన్ వ్యాపార సంబంధాల బలోపేతంపై చర్చలు జరిగాయి.
ఈ కీలక సమావేశంలో అతుసుషి సవాడా (డైరెక్టర్, ఇన్వెస్ట్మెంట్ & ట్రేడ్ డివిజన్), ఫ్యూమిహిర్ నంభు (వైస్ చైర్పర్సన్, అసెంబ్లీ), తరో కవశీమ (చైర్పర్సన్, అసెంబ్లీ), కెన్జి తక్కుషిమా (ఇంటర్నేషనల్ అఫైర్స్ డివిజన్) తదితరులు పాల్గొన్నారు. సమావేశం మొత్తం పూర్తిగా సానుకూల వాతావరణంలో సాగి, తెలంగాణ–జపాన్ పెట్టుబడి సంబంధాలు మరింత బలపడే అవకాశాలు స్పష్టంగా కనిపించాయని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ పర్యటన రెండు దేశాల వ్యాపార, సాంకేతిక రంగాల మధ్య కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని భావిస్తున్నారు.








