హైదరాబాద్ నుండి రాయచూర్ వరకు రోజువారీ రైలు సర్వీసులు నడపాలని తెలంగాణ ఉద్యమకారుడు రుద్ర సముద్రం రామలింగం డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డైరెక్టర్ ప్రశాంత్ జీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మార్గంలో చదువు, వ్యాపారం, ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ రంగం, రాజకీయ ప్రయాణాల కోసం వందలాది మంది రోజూ ప్రయాణిస్తున్నారని, అయితే రైలు సౌకర్యం లేక రోడ్డు మార్గంపైనే ఆధారపడాల్సి వస్తోందని రామలింగం పేర్కొన్నారు.
ప్రస్తుతం రాయచూర్–హైదరాబాద్ మార్గంలో ఆర్టీసీ రోజుకు సుమారు 60 బస్సులు నడిపి భారీ ఆదాయం పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ భారీ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒకే ఒక్క రైలు సరిపోదని, కనీసం ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి — ఇలా రెండు రైళ్లు నడపాలని ఆయన కోరారు. రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తే ప్రజా రవాణా మరింత సులభతరం అవుతుందని, రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ రూట్ ద్వారా బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు దాదాపు 200 కిలోమీటర్లు దూరం తగ్గే అవకాశం ఉందని రామలింగం తెలిపారు. అందుకే మహబూబ్నగర్–మక్తల్ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు నడపాలని, అదనంగా మక్తల్ మీదుగా తిరుపతికి కూడా రైలు సర్వీసులు ప్రారంభించాలని ఆయన సూచించారు. ఈ మార్గంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు టైమ్ స్లోట్లలో రైళ్లు నడిస్తే వేలాది మందికి భారీగా ఉపయోగపడుతుందన్నారు.
తమ వినతిని పరిశీలించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని అడిషనల్ డైరెక్టర్ ప్రశాంత్ జీ హామీ ఇచ్చారని రుద్ర సముద్రం రామలింగం తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైలు సర్వీసులు పెంచాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.









