గుంటూరు జిల్లా కూరగల్లులో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం స్థానికులను మాత్రమే కాదు, చూసిన ప్రతి ఒక్కరిని నిర్ఘాంతపరిచింది. ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయిన బైక్, వేగంగా వెళ్తున్న టిప్పర్ వాహనం కింద పడి ప్రమాదానికి గురైంది. బైకర్ పడిన వెంటనే టిప్పర్ రెండు చక్రాలు వరుసగా అతని తలపై నుంచి దూసుకెళ్లిన ఆ భయానక దృశ్యం హృదయాన్ని కలచివేస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రమాదం జరగడంతో బైక్ పై ఉన్న యువకుడు ప్రాణాంతక గాయాలపాలై రోడ్డుపై కుప్పకూలిపోయాడు.
ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడు తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతుండగా, అక్కడున్న ప్రజల్లో ఎవరూ అతన్ని కాపాడేందుకు ముందుకు రావడం దురదృష్టకరం. ఒక్క ప్రయత్నం చేసినా ప్రాణం నిలిచి ఉండేదేమో అనే ఆలోచన నెటిజన్లలో ఆవేదన కలిగిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్‌లో ప్రజలు ప్రమాదాన్ని కేవలం చూస్తూ ఉండిపోవడం, బాధితుడి పరిస్థితిని పట్టించుకోకపోవడం చూసి చాలా మంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రజల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. “మానవత్వం ఎక్కడికి పోయింది?”, “ప్రాణం పోతున్నా ఎవ్వరూ అంబులెన్స్‌కి కూడా ఫోన్ చేయలేదు” వంటి కామెంట్లు విస్తృతంగా వస్తున్నాయి. ప్రమాద స్థలంలో ఎవరూ సహాయం చేయకపోవడానికి కారణం పోలీసు కేసులు వస్తాయేమో అన్న భయమని కొందరు వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి భయాలు ప్రాణం ముందు ఎంత చిన్నవో సమాజం గుర్తించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ దుర్ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమా? లేక బైకర్ తప్పిదమా? అనే కోణాలన్నీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇటువంటి ప్రమాదాలు మళ్లీ చోటుచేసుకోకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ప్రమాదంలో పడ్డ వారిని వెంటనే సహాయం చేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని సామాజిక వర్గాలు మరోసారి గుర్తుచేస్తున్నాయి.









