పాత కొత్తగూడెం ఇందిరమ్మ కాలనీలో నెలకొన్న మురుగు నీటి సమస్య ఇప్పుడు ప్రాంతాన్ని దుర్వాసనతో ముంచెత్తుతోంది. వర్షపు నీరు అనుకుంటే పొరపాటే, ఎందుకంటే పల్లపు ప్రాంతాల నుంచి వచ్చే వినియోగించిన మురుగు నీరు దారి లేక ఇంట్లలోకి చొరబడి నివాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇంటి ఆవరణ మొత్తం మురికి నీటితో నిండిపోవడంతో అక్కడ నివసించే కుటుంబాలు గృహాలే కాదు బయట కూడా కాలి పెట్టలేని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. జిల్లా కేంద్రం, కార్పొరేషన్ ప్రాంతం అయినా సమస్యకు శాశ్వత పరిష్కారం లేకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.
ఈ కాలనీలో దుర్వాసన రోజువారీ జీవితంలో భాగమైపోయింది. డ్రైనేజీలలో పేరుకుపోయిన సిల్ట్, మట్టితో మార్గాలు పూర్తిగా మూసుకుపోవడంతో పై నుంచి వచ్చే మురుగు నీరు ఏ దారి లేక నేరుగా ఇళ్లలోకి చేరుతోంది. చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఈ దుర్వాసనతో మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా స్పందన లేకపోవడం స్థానికులను మరింత కోపానికి గురి చేస్తోంది.
ఇందిరమ్మ కాలనీలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ పేరుకే మిగిలిపోయింది. శుభ్రపర్చాల్సిన డ్రైనేజీలు సంవత్సరాలుగా చూసే వాళ్లే లేరని ప్రజలు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీలు క్లియర్ చేయకపోవడంతో మురుగు ప్రవాహం పూర్తిగా నిలిచిపోయి ప్రాంతం మొత్తం మురికితో నిండిపోతోంది. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్య వైఖరి కొనసాగుతూనే ఉందంటున్నారు.
ప్రజలు ఒక్కటే కోరుతున్నారు—డ్రైనేజీని వెంటనే శుభ్రపరచి, సిల్ట్ పూర్తిగా తొలగించి నీరు సాఫీగా దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని. ఇది జిల్లా కేంద్రం కావడంతో సమస్యను తక్షణమే పరిష్కరించవచ్చని భావించినా వాస్తవ పరిస్థితి మాత్రం విరుద్ధంగా ఉంది. వారి విన్నపాలను అధికారులు ఎంత త్వరగా ఆచరణలో పెడతారో చూడాల్సి ఉంది.









