వేబిల్ లేకుండానే ఇసుక దోపిడీ దారుణం

Illegal sand transport, overloading and lack of enforcement let sand mafias thrive, causing huge revenue loss and public unrest in Telangana.

రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లలో జరుగుతున్న అక్రమాలు రోజురోజుకు విస్తరిస్తూ ప్రభుత్వానికి భారీ నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. నిత్యం వందలాది లారీలు వేల టన్నుల ఇసుకను వేబిల్ లేకుండా, అనుమతి లేకుండా తరలిస్తుండడం సాధారణమైపోయింది. రెవెన్యూ లేదా ఖనిజ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్లుగా ఇసుకను అక్రమంగా తరలించుకుంటున్నారు. అడిగే వారు లేని పరిస్థితిని మాఫియాలు పూర్తిగా వినియోగించుకుంటున్నాయి.

ఇసుక రవాణాలో అధికంగా కనిపిస్తున్న సమస్య ఓవర్‌లోడ్. ఒక లారీ సామర్థ్యానికి మించి ఇసుక నింపడానికి టన్నుకు రూ.2000–3000 వరకు అదనపు వసూలు జరుగుతోంది. ఇందులో ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా జమకాకుండా నేరుగా కాంట్రాక్టర్ జేబులోకే చేరుతోంది. టీజీఎండీసీ జారీ చేసే వేబిల్ తప్పనిసరి అయినా కూడా చాలా లారీలు వేబిల్ లేకుండానే ఇసుక రవాణా చేస్తుండటం ప్రభుత్వానికి రోజుకు లక్షల్లో నష్టం కలిగిస్తోంది. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మాత్రం ప్రేక్షకుల్లా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

రీచ్‌లపై తనిఖీలు చేయడంలో అధికారులు వెనుకడుగు వేస్తుండటం, కాంట్రాక్టర్లపైన చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలను ఉల్లంఘించిన రీచ్‌పై భారీ జరిమానా లేదా కాంట్రాక్ట్ రద్దు చేయాలన్న అధికారాలు ఉన్నప్పటికీ, అమలు మాత్రం జరగడం లేదు. సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్ ఉన్నాయని అధికారులు చెప్పినా, అవి కేవలం కాగితాలపైనే ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం సైలెంట్‌గా ఉండటం ఇసుక మాఫియాలకు మరింత తోడ్పాటు అందిస్తోంది.

వీటన్నిటికి పోనిలా రాజపేట గ్రామ ప్రజలు దుమ్ము, ధూళితో విసిగిపోయి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వందల కొద్దీ లారీలు గ్రామం గుండా నిత్యం సంచరిస్తుండటంతో గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని వారు ఆరోపించారు. గురువారం లోడ్ చేసిన 200 లారీల డ్రైవర్లు నీరు, భోజనం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు వెల్లడించారు. ఇసుక ర్యాంపుల్లో స్థానికులకు ఉపాధి ఇవ్వాలని, లారీల రాకపోకల వల్ల జరుగుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share