నవంబర్ 21న విడుదలకు సిద్ధమవుతున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం తాజాగా భారీగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అఖిల్, తేజస్విని ప్రధాన జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తుండగా, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్ మరియు మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడివి శేష్ హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.
ట్రైలర్‌ను చూసిన తర్వాత శేష్ ఈ చిత్రంపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఈవెంట్‌కు వచ్చానని ఆయన స్పష్టం చేశారు. ‘కేరాఫ్ కంచెరపాలెం’ సినిమా తరహాలో, రిలీజ్‌కు ముందే వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్స్ వేయాలని చిత్ర బృందానికి సూచించారు. అలా చేస్తే ప్రేక్షకులే స్వయంగా సినిమాను ముందుకు తీసుకొస్తారని, ‘రాజు వెడ్స్ రాంబాయి’ అలాంటి కంటెంట్ ఉన్న చిత్రం అని శేష్ అభిప్రాయపడ్డారు.
అఖిల్, తేజస్విని, చైతన్యల నటన ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయని శేష్ పేర్కొన్నారు. ముఖ్యంగా, చైతు జొన్నలగడ్డకు తన సినిమాలో అవకాశం కల్పిస్తానని ప్రకటించడం ఈ ఈవెంట్‌లో హైలైట్‌గా మారింది. సోషల్ మీడియా యుగంలో వైరల్ కంటెంట్ కోసం పరుగులు తీసే సమయంలో, స్వచ్ఛమైన ప్రేమకథను తెరపైకి తీసుకురావడం చిన్న విషయం కాదని ఆయన అభినందించారు.
ట్రైలర్‌లో కనిపించిన భావోద్వేగం, సున్నితమైన ప్రేమకథ ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని శేష్ నమ్మకం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా యాప్స్ ఎంత మారినా ప్రేమ మాత్రం మారదనే సందేశంతో వచ్చిన ఈ సినిమా నిజమైన, అందమైన లవ్ స్టోరీగా నిలుస్తుందని అన్నారు. విడుదల తర్వాత జరిగే సక్సెస్ సెలబ్రేషన్‌కు కూడా హాజరవుతానని శేష్ మాట ఇవ్వడంతో, ఈ చిత్రంపై మరింత పాజిటివ్ బజ్ ఏర్పడింది.









