జీహెచ్ఎంసీ విస్తరణతో పారిశుద్ధ్యంపై సమగ్ర శిక్షణ

GHMC conducts orientation for newly appointed officials on public health, sanitation systems, waste management and city infrastructure.

జీహెచ్ఎంసీ విస్తరణ నేపథ్యంలో నూతనంగా నియమితులైన జోనల్ కమిషనర్లు, అసిస్టెంట్ మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై సమగ్ర ఒరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా నగర ప్రజారోగ్యం, పారిశుద్ధ్య మౌలిక వసతులు, అమలులో ఉన్న కార్యక్రమాలపై అధికారులకు విస్తృత అవగాహన కల్పించారు. అడిషినల్ కమిషనర్ రఘుప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కీలక అంశాలను వివరించారు.

ఈ ఒరియెంటేషన్ కార్యక్రమంలో సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగానికి చెందిన ఏఈలు, డీఈఈలు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ హెల్త్ (ఏఎంఓహెచ్), వెటర్నరీ డైరెక్టర్లు, సీనియర్ మరియు అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు, కన్సెషనైర్ ఏజెన్సీల ప్రతినిధులు, నిర్మాణ వ్యర్థాల ఆపరేటర్లు, జోనల్ కమిషనర్లు, జోనల్ అదనపు కమిషనర్లు, ఆరోగ్యం & పారిశుద్ధ్య అదనపు కమిషనర్‌తో పాటు విభాగాధిపతులు, హెడ్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రఘుప్రసాద్ మాట్లాడుతూ, 2,053 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధిలో 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులలో నివసిస్తున్న 1.34 కోట్ల జనాభాకు అందిస్తున్న పారిశుద్ధ్య సేవలపై వివరించారు. నగరంలో రోజుకు సగటున 9,100 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, వ్యక్తి ప్రాతిపదికన వ్యర్థాల ఉత్పత్తి 680.59 గ్రాములుగా ఉందని తెలిపారు.

పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా శానిటేషన్ వర్కర్లు, స్వీపింగ్ గ్రూపులు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పబ్లిక్ హెల్త్ సిబ్బంది, ఇన్‌స్పెక్టర్లు, సూపర్వైజర్లతో కూడిన బలమైన వ్యవస్థపై అవగాహన కల్పించారు. అలాగే రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్‌తో పీపీపీ విధానంలో అమలవుతున్న సమగ్ర వ్యర్థాల నిర్వహణ, ప్రాథమిక నుంచి తృతీయ సేకరణ విధానాలు, జవహర్‌నగర్ (48 మెగావాట్లు, అదనంగా 24 మెగావాట్లు ప్రగతిలో), దుండిగల్ (14.5 మెగావాట్లు) వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వివరాలను వివరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share