రోడ్ల సమస్యలు ఉన్నట్లయితే, అభివృద్ధి కోసం అవసరమైన నిధులు మంజూరు చేసి సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం చండూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తూ మండలంలోని యరుగండ్లపల్లి గ్రామంలో కొద్దిసేపు ఆగి కార్యకర్తలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో రోడ్ల పరిస్థితిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని చెప్పారు. ప్రజలు ఇబ్బంది పడేలా ఎక్కడైనా రోడ్ల సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైన ప్రతిపాదనలు పంపితే తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అలాగే గిరిజన గ్రామపంచాయతీ తండాల్లో కొత్తగా చౌక ధరల దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లయితే వెంటనే రేషన్ దుకాణాలను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, పులి మామిడి నరసింహారెడ్డి, ఏడు దొడ్ల కృష్ణారెడ్డి, మాల్ డైరెక్టర్ జమ్ముల వెంకటేశ్, మాజీ ఉపసర్పంచ్ వనపర్తి యాదయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









