యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ప్రేమలత చేసిన చర్య ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. డ్యూటీ సమయంలో పోలీస్ యూనిఫాంలోనే ఇన్‌స్టాగ్రామ్ లైవ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.
డ్యూటీలో ఉండగానే లైవ్‌లోకి వచ్చిన ప్రేమలత నెటిజన్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు “డ్యూటీ సమయంలో లైవ్ చేయడం ఎందుకు?” అని ప్రశ్నించగా, “ఇది ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్.. మాకు ఇక్కడ ఏ పనీ లేదు. అందుకే లైవ్‌లోకి వచ్చాను” అని ఆమె సమాధానం ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఉండగా ఈ తరహా ప్రవర్తన సరికాదని అభిప్రాయపడ్డారు. డ్యూటీ సమయంలో సోషల్ మీడియా లైవ్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని, ఇది శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యగా పేర్కొన్నారు.
వీడియో వైరల్ కావడంతో విషయం జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. యూనిఫాంలో ఉండి శాఖ గౌరవానికి భంగం కలిగించినందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై మహిళా కానిస్టేబుల్ ప్రేమలతపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.









