మండలంలోని రావిచేడ్, మక్త మాదారం గ్రామాలకు చెందిన పెన్షన్‌దారులు పెన్షన్ పంపిణీలో పోస్ట్‌మ్యాన్ నిర్లక్ష్యం వహిస్తున్నాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ ఇస్తామని చెప్పిన సమయానికి రాకపోవడం, వచ్చిన వృద్ధులను అనవసరంగా ఎదురు చూడాల్సి రావడం వంటి సమస్యలు నిత్యకృత్యంగా మారాయని వారు ఆరోపించారు.
పెన్షన్ కోసం వెళ్లిన వృద్ధులతో మాటలతో కస్సుబుస్సులాడుతూ అవమానిస్తున్నారని, తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నెలల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతోందని పెన్షన్‌దారులు వాపోయారు. ప్రతినెలా వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిర్ణీత సమయంలో పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పెన్షన్ పంపిణీలో మానవీయతతో వ్యవహరించాలని, వృద్ధుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై రావిచేడ్ గ్రామ సర్పంచ్ బొప్పిడి గోపాల్ స్పందిస్తూ, వృద్ధులను ఇబ్బందులకు గురి చేయకుండా పెన్షన్‌దారులకు సమయానికి పెన్షన్ అందించాలని కోరారు. సమయపాలన లేకుండా, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని, పెన్షన్ పంపిణీ వ్యవస్థ సక్రమంగా జరిగేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.









