వరంగల్‌లో యూరియా కేంద్రాల తనిఖీ

Agriculture officials assured that sufficient urea stocks are available in Warangal district and farmers need not panic.

వరంగల్ జిల్లా మోగిలిచెర్ల, తోగార్రాయి యూరియా పంపిణీ కేంద్రాలను వ్యవసాయ అదనపు సంచాలకులు విజయ్ కుమార్, జేడీఏ అనురాధతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి యూరియా సరఫరా, పంపిణీ విధానం, ఎదురవుతున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూరియా పంపిణీ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, క్షేత్రస్థాయి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ప్రస్తుత సీజన్‌కు రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ అవసరమైనంత యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఎలాంటి కొరత లేదని, రైతులు అనవసర ఆందోళన చెందకుండా ముందస్తుగా అధికంగా యూరియా నిల్వ చేసుకునే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. ప్రభుత్వం సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “యూరియా యాప్”పై రైతుల అభిప్రాయాలను కూడా అధికారులు సేకరించారు. అనంతరం చింతలపల్లి రేక్ పాయింట్‌ను సందర్శించి జిల్లా వ్యవసాయ అధికారికి పలు సూచనలు చేశారు. అలాగే ఎరువుల పరీక్ష కేంద్రం నూతన భవనాన్ని పరిశీలించి, ఈ కేంద్రం త్వరలోనే ప్రారంభం కానుందని వెల్లడించారు.

తదుపరి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను కలిసి, యాసంగి 2025-26 సీజన్‌కు జిల్లాకు అవసరమైన 36,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు వ్యవసాయ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందని నివేదికలు సమర్పించారు. ప్రస్తుతం జిల్లా మార్క్‌ఫెడ్‌లో 5,700 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share