డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శాసన మండలి, శాసనసభ రెండూ ప్రజాస్వామ్యానికి ప్రతీకలని, సభ్యుల ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత సీఎం, మంత్రులపై ఉందని ఆయన గుర్తుచేశారు.
వార్తల ప్రసారాల ద్వారా సభల కార్యక్రమం రాష్ట్రం, దేశమంతా ప్రజలకు చేరుతుందని, అధికారులు మంత్రులకు, సభ్యులకు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. మీడియా అనుమతించకుండా సమాచారం ప్రసారం చేస్తే అది చట్టసభల హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని కూడా సూచించారు.
సభల గౌరవాన్ని పెంచేలా ఉభయ సభలు నిర్వహించాలన్న లక్ష్యంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సభ్యుల ప్రశ్నలకు అవసరమైన సమాధానాలు, పెండింగ్ రిపోర్ట్‌లు, హామీల వివరాలు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు.
సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, కౌన్సిల్ సెక్రటరీ నరసింహ చార్యులు, అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి, సీనియర్ అధికారులు వికాస్ రాజ్, దాన కిషోర్, జయేష్ రంజన్, రఘునందన్ రావు, శ్రీధర్, నదీమ్ అహ్మద్, శైలజ రమా అయ్యర్, యోగితారానా, లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









