రాష్ట్ర పోలీసు శాఖలోని మహిళ భద్రత విభాగం కొత్త సంవత్సరంలో హైదరాబాద్‌లో నివసిస్తున్న మహిళలకు శుభవార్తను అందించింది. ఎంఓడబ్ల్యూఓ సంస్థతో కలిసి మహిళల కోసం ప్రత్యేకంగా డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహించనున్నారు. ఈ మేళా ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
మహిళ ప్రయాణీకుల కోసం బైక్ ట్యాక్సీ డ్రైవింగ్, ఈ-ఆటో డ్రైవింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ అందించడంతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు సహాయం చేయనున్నారు. అంతేకాకుండా వాహనాల లీజు, రుణ సదుపాయాలు పొందడంలోనూ సహకారం అందిస్తామని మహిళ భద్రత విభాగం అధికారులు తెలిపారు.
ఈ ఉద్యోగ మేళాలో 21 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల హైదరాబాద్‌కు చెందిన మహిళలు పాల్గొనవచ్చని పోలీసులు వివరించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక డ్రైవర్ ఉద్యోగ మేళా జనవరి 3న అంబర్‌పేట్ పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 8978862299 నంబర్‌లో సంప్రదించాలని పోలీసు అధికారులు సూచించారు.









