రేవంత్ భాషపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

BRS leader KTR lashed out at CM Revanth Reddy over remarks on KCR, questioning his governance and silence on Palamuru project issues.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గం నేతల చేరికల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ‘నన్ను వ్యక్తిగతంగా తిట్టాలని నాకు లేదు. కానీ తెలంగాణ తెచ్చిన నాయకుడిని, రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రిని, నా తండ్రిని తిడుతుంటే ఒక కొడుకుగా నాకు ఆవేశం రాదా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను రోజూ అనుచితంగా విమర్శిస్తున్నారని, ఎడమ కాలి చెప్పుతో కొట్టాలనిపిస్తున్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామని, కుర్చీకి ఇచ్చే గౌరవంతోనే ఊరుకుంటున్నామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేటి పరిస్థితి కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినట్టుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేకనే రేవంత్‌రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్ట్‌పై 90 శాతం పనులు పూర్తయినా మిగిలిన కొద్దిపాటి నిధులు వెచ్చించి నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని కేసీఆర్ అడిగితే దానికి సమాధానం చెప్పలేక దూషణలకు దిగుతున్నారని అన్నారు. ఎనిమిది నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌ను వెనక్కి పంపినా మళ్లీ పంపి ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి సీఎంకు లేదని విమర్శించారు. కేసీఆర్ అడగడం తప్పా? అని నిలదీశారు.

రోడ్లపై పెయింటింగ్స్ వేసుకునే స్థాయి నుంచి సీఎం అయ్యారని వ్యాఖ్యానిస్తూ, జీవితంలో ఎదగడం తప్పు కాదని కానీ అది మంచి పనులతో రావాలని కేటీఆర్ సూచించారు. దొంగ పనులు, లంచాలు, సంచులు మోసి, జైలుకు వెళ్లి రావడమే గొప్పగా ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో డబ్బులు పెట్టి సీఎం పదవి తెచ్చుకున్నారని, ఇప్పటికీ నెలనెలా ఢిల్లీకి పైసలు పంపుతూ పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీలపై ప్రజలు అడిగితే అసభ్య పదజాలంతో బెదిరించడం ఏ రకమైన సంస్కారమని ప్రశ్నించారు.

తన చదువుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘నేను గుంటూరులో చదివితే ఎందుకు నొప్పి? అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఒకటే. హైదరాబాద్, పుణె, అమెరికాలో కూడా చదివాను’ అని తెలిపారు. ఆంధ్రాలో చదవడం తప్పంటున్న రేవంత్ ఆంధ్రా నుంచి అల్లుడిని తెచ్చుకోవడం తప్పు కాదా అంటూ ‘భీమవరం బుల్లోడు’ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను మళ్లీ సీఎం కానీయనని శపథాలు చేస్తున్న రేవంత్‌కు ఒక్కటే సవాల్ విసిరారు—హామీలు అమలు చేస్తానని శపథం చేయాలని, వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో కూడా గెలవనీయబోమని హెచ్చరించారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share