టీజీఎస్ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణ అంశం యాజమాన్యం పరిధిలో లేదని, ప్రభుత్వ అనుమతితోనే యూనియన్ల కార్యకలాపాలను అనుమతిస్తామని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ జేఏసీ నేతలు శుక్రవారం బస్ భవన్లో ఎండీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం. థామస్ రెడ్డి, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మొత్తం 22 డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు జేఏసీ నేతలు తెలిపారు. 2017 వేతన సవరణకు సంబంధించిన అలవెన్సులు పెంచి చెల్లించే అంశంపై ఎండీ సానుకూలంగా స్పందించారని వెంకన్న తెలిపారు. అలాగే కారుణ్య నియామకాల్లో ప్రస్తుతం మూడు సంవత్సరాల పాటు కన్సాలిడేటెడ్ పే విధానాన్ని రెండు సంవత్సరాలకు తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎండీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. 2021 వేతన సవరణను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని కూడా తెలిపారు.
రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను వీలైనంత త్వరగా చెల్లిస్తామని ఎండీ స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం కింద ప్రయాణిస్తున్న మహిళలకు స్మార్ట్ కార్డు అందించే అంశంపై సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. అలాగే కార్మికులపై పనిభారం తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటామని, ప్రయాణికులు లేని రూట్లలో కిలోమీటర్లను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కారుణ్య నియామకాల వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచేందుకు బోర్డు అనుమతి కోరతామని తెలిపారు.
తార్నాక హాస్పిటల్లో రోగులతో పాటు వచ్చే అటెండెంట్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, త్వరలో విశ్రాంతి భవనం నిర్మించి అందులో డైనింగ్ హాల్ ఏర్పాటు చేస్తామని ఎండీ వెల్లడించారు. ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ ప్రైవేటు వాహనాల రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. యాజమాన్యం పరిధిలో ఉన్న సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందుకు జేఏసీ నాయకులు ఎండీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు ఎన్. కమలాకర్ గౌడ్, జె. రాఘవులు, బుద్ధ విశాల్, ఎం.ఎ. మజీద్, జి. రాములు, జి. రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.









