తమిళనాడులోని కడలూర్ జిల్లాలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా ఎనిమిది మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. తిరుచ్చి నుంచి చెన్నై వైపు ప్రయాణిస్తున్న తమిళనాడు రాష్ట్ర ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా టైరు పేలడంతో వాహనం అదుపు తప్పింది. అతివేగంతో ఉన్న బస్సు రోడ్డు మధ్యలోని డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఢీ తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ప్రమాదంలో బస్సు, కారులో ప్రయాణిస్తున్న మొత్తం ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా తిరుచ్చి–చెన్నై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








