నూతన సంవత్సర వేడుకల పేరుతో అల్లర్లు, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ బుధవారం హెచ్చరించారు. హద్దులు దాటితే తాటతీస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి పట్టణ వ్యాప్తంగా ప్రత్యేక పోలీసు బందోబస్తుతో పాటు విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.
అనుమతి లేకుండా డీజే సౌండ్ సిస్టమ్‌లు ఏర్పాటు చేయడం, అధిక శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, రహదారులపై గుంపులుగా చేరడం వంటి చర్యలను సహించేది లేదని సీఐ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని, పట్టుబడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏ చర్యనైనా కఠినంగా అణిచివేస్తామని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిని కాపాడేలా ఎలాంటి సిఫారసులు పనిచేయవని సీఐ తేల్చిచెప్పారు. నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని, పోలీసు ఆదేశాలకు పూర్తిగా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని గౌరవిస్తేనే సురక్షిత వేడుకలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.









