బర్త్‌డే వీడియో డిలీట్‌.. థియేటర్‌లో ఘర్షణ

A dispute erupted at a private theatre in Himayatnagar after a birthday celebration video was deleted, leading to vandalism and police action.

బర్త్‌డే వేడుకల వీడియో విషయంలో తలెత్తిన వివాదం హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ థియేటర్‌లో ఘర్షణకు దారి తీసింది. నారాయణగూడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు, ఈ నెల 5న నారాయణగూడకు చెందిన భానుప్రసాద్ తన కుటుంబ సభ్యుల బర్త్‌డే వేడుకల కోసం హిమాయత్‌నగర్‌లోని “జాలీ డిస్ట్రిక్ట్” అనే ప్రైవేట్ థియేటర్‌ను బుక్ చేసుకున్నాడు. వేడుకల సందర్భంగా వీడియోను థియేటర్ సిబ్బందితో చిత్రీకరించేందుకు ముందుగానే ఒప్పందం చేసుకున్నారు.

వేడుకలు ముగిసిన తరువాత మరుసటి రోజు వీడియో కోసం థియేటర్‌కు వెళ్లిన భానుప్రసాద్‌కు అనుకోకుండా వీడియో డిలీట్ అయిందని సిబ్బంది తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న భానుప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వీడియో తనకు తప్పనిసరిగా కావాలంటూ పలు మార్లు థియేటర్ సిబ్బందిని సంప్రదించి, పరిష్కారం కోరుతూ తిరిగాడు. అయితే వీడియో తిరిగి పొందడం సాధ్యం కాదని సిబ్బంది స్పష్టం చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఈ నెల 22న అర్ధరాత్రి భానుప్రసాద్ తన ఇద్దరు కుమారులతో కలిసి థియేటర్‌కు వచ్చి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. మాట మాట పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కోపోద్రేకానికి గురైన భానుప్రసాద్, అతని కుమారులు థియేటర్‌లో ఉన్న ఫర్నిచర్, పూల కుండీలు తదితర వస్తువులను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన సిబ్బందిలో ఒకరికి గాయాలు అయ్యాయి.

ఈ ఘటనపై ప్రైవేట్ థియేటర్ యజమాని వివేక్ నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share